కేరళ వరదలు: మృతుల సంఖ్య 100కు పైనే, సహాయ చర్యల్లో చురుగ్గా వాలంటీర్లు

  • 14 ఆగస్టు 2019
వరద సహాయ చర్యల్లో ఎన్‌డీఆర్ఎఫ్ సిబ్బంది Image copyright Twitter/@NDRFHQ
చిత్రం శీర్షిక వరద సహాయ చర్యల్లో ఎన్‌డీఆర్ఎఫ్ సిబ్బంది

కేరళ వరదల్లో చనిపోయినవారి సంఖ్య 102కు చేరిందని కేరళ రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది.

59మంది జాడ తెలియకుండాపోయిందని, వరదల కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన ప్రమాదాల్లో 35మంది గాయపడ్డారని వెల్లడించింది.

మలప్పురం జిల్లాలోని కావలప్పరలో కొండచరియలు విరిగిపడటంతో ఎక్కువ ప్రాణనష్టం వాటిల్లింది. అక్కడ మృతదేహాల వెలికితీత కొనసాగుతోంది. 30 మందికి పైగా గ్రామస్థులు ఇంకా శిథిలాల కింద ఉండిపోయారు.

గత ఏడాది దాదాపు మూడు వేల కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వం వరద సహాయం కింద కేరళకు అందించింది. ఇప్పుడు కేంద్రం తక్షణ సాయం కింద రూ.52 కోట్లు కేరళకు అందిస్తున్నట్టు కేంద్ర మంత్రి మురళీధరన్ తెలిపారు. అదనంగా నాలుగు కోట్ల రూపాయల విలువైన ఔషధాలు కూడా పంపుతున్నట్టు చెప్పారు.

మంగళవారం కొండచరియలు విరిగిన ప్రాంతాలైన పుథుమల్ల, కావలప్పరల్లో ముఖ్యమంత్రి పినరయి విజయన్ పర్యటించారు.

మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.
Media captionకేరళ వరదలు: సహాయ చర్యల్లో చురుగ్గా పాల్గొంటున్న వాలంటీర్లు

రూ.30 వేల కోట్లు కావాలి: ముఖ్యమంత్రి

"గత సంవత్సరం వచ్చిన విపత్తు నుంచి కోలుకోక ముందే మళ్లీ ఇంత తీవ్రస్థాయి విపత్తు ఏర్పడింది. ఐక్యరాజ్య సమితి సంస్థల అంచనాల ప్రకారం గత సంవత్సర వరదలు, ఇప్పుడు ఏర్పడ్డ విపత్తు మిగిల్చిన నష్టం నుంచి కోలుకోవటానికి దాదాపు 30 వేల కోట్ల రూపాయలు అవసరం" అని ఆయన ఒక ఫేస్‌బుక్ పోస్ట్‌లో తెలిపారు.

వరద బాధితులకు వచ్చే మూడు నెలల పాటు ఉచితంగా రేషన్ అందిస్తున్నట్టు కేరళ ఆహార, పౌరసరఫరాల శాఖ మంత్రి పి.తిలోత్తమం చెప్పారు.

మలప్పురం, కోజికోడ్ జిల్లాకు భారత వాతవరణ శాఖ (ఐఎండీ) రెడ్ అలర్ట్ ప్రకటించింది.

కొన్ని ప్రాంతాల్లో నీటిమట్టం తగ్గడంతో సహాయ శిబిరాల నుంచి ప్రజలు వారి ఇళ్లకు వెళ్తున్నారు.

సహాయ చర్యల్లో చురుగ్గా వాలంటీర్లు

వరద సహాయ చర్యల్లో వాలంటీర్లు చురుగ్గా పాల్గొంటున్నారు. అవసరమైన వారికి ఇల్లు శుభ్రం చేసేందుకు వారు ముందుకు వస్తున్నారు.

మలప్పురానికి చెందిన సాదిక్ స్నేహితులతో కలిసి ఇళ్లు శుభ్రం చేయడానికి కావాల్సిన సామగ్రి కొని, ఒక బండి తీసుకొని దాదాపు 15 మంది ఇళ్లకు వెళ్లి సేవలు అందిస్తున్నారు.

"మాలో కొంత మంది విద్యార్థులు, మరి కొంత మంది సొంత వ్యాపారాలున్నవారు ఉన్నారు. రెండు రోజులుగా మేం ఇదే పనిలో ఉన్నాం" అని సాదిక్ చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)