కేరళ వరదలు: పిల్లలను చూస్తే ఆనందం, బాధ ఒకేసారి కలుగుతున్నాయి

  • 16 ఆగస్టు 2019
కేరళ సహాయ శిబిరాల్లో పిల్లలు

''ఇది ఈజీ కాదు. ఒక మహిళను.. పిల్లల సంరక్షణ చూసుకోవటం కష్టం. గత ఏడాది మా ఇళ్లు వరద ముంపుకు గురైనపుడు మేం దాదాపు 20 రోజుల పాటు మరో శిబిరంలో ఉన్నాం. ఈ సంవత్సరం కూడా శిబిరానికి వచ్చాం. కానీ ఇప్పుడు మా ఇళ్లు కొట్టుకుపోయాయి. ఈసారి ఈ సహాయ శిబిరాల్లో ఎంత కాలం ఉంటామో మాకు తెలియదు'' అంటూ ఆవేదన వ్యక్తంచేశారు దీప్తి.

ఆమె ఒక గిరిజన మహిళ. కల్కుళం శిబిరంలో ఉన్నారు. ఆమె ఇద్దరు పిల్లలు - ఒకరికి నాలుగేళ్లు, ఇంకొకరికి ఆరేళ్లు ఉంటాయి - మిగతా పిల్లలతో కలిసి దాగుడుమూతలు ఆడుతున్నారు.

ఈ శిబిరాల్లోని పిల్లలను ఆటపాటల్లో నిమగ్నం చేయటానికి సమీకృత శిశు అభివృద్ధి సేవ (ఐసీడీఎస్) సిబ్బందిని నియమించారు.

''ఈ పిల్లలు నిజంగా తెలివైన వారు. మేం తొమ్మిది రోజులుగా ఇక్కడ పని చేస్తున్నాం. మొదట్లో పిల్లలను వారి తల్లిదండ్రులను విడిచిపెట్టి ఆడుకోవటానికి రప్పించటం కష్టంగా ఉండేది. వాళ్లు తమ తల్లిదండ్రులకు అతుక్కుపోయి ఉండేవాళ్లు. చాలా ఒత్తిడికి గురయ్యారని స్పష్టంగా కనిపించేది. ఇప్పుడు పరిస్థితి కొంత మెరుగుపడింది. పిల్లలు ఆడుకుంటున్నారు. తమ సొంత ఆటలు కూడా ఆడుకుంటున్నారు'' అని వివరించారు ఐసీడీఎస్ ఉద్యోగిని శైలజ.

మేం వివిధ సహాయ శిబిరాలను సందర్శించినపుడు.. మానసిక నిపుణులు తల్లిదండ్రులు, పిల్లలను కలిపి చిన్న చిన్న నాటకాలు, పాటల కార్యక్రమాలు నిర్వహించటం చూశాం. సహాయ శిబిరాల్లో ఈ కార్యక్రమాలు నిర్వహించటానికి స్వచ్ఛందంగా ముందుకు వచ్చిన ఫారిస్, అఫ్సల్‌లతో కలిసి ఒక రోజు గడిపాం.

ఇతర మానసిక ఆరోగ్య నిపుణులతో, కేరళ రాష్ట్ర ప్రభుత్వ మానసిక ఆరోగ్య అధికారులతో కలిసి సమన్వయంతో పనిచేస్తున్నామని వారు చెప్పారు.

ఈ ప్రజలకు ఊరటనివ్వటానికి తమ శక్తిమేరకు ప్రయత్నిస్తున్నామని మెప్పాడి శిబిరాన్ని సందర్శించిన వాయనాడ్ జిల్లా డిప్యూటీ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ప్రియ పేర్కొన్నారు.

''ఈ శిబిరాల్లో ఆరోగ్యానికి ప్రాధాన్యం ఇస్తున్నాం. ప్రత్యేకించి.. ఆప్తులను కోల్పోయిన వారి మానసిక ఆరోగ్యం మీద కూడా దృష్టి పెట్టాం. పిల్లలు ఈ విధ్వంసం వల్ల ఆందోళన చెందకుండా ఉండటం కోసం ఈ శిబిరాల్లో వారి కోసం చిన్న చిన్న కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం'' అని ఆమె వివరించారు.

ఏడేళ్ల రిజు ఈ శిబిరంలో కొందరు స్నేహితులను సంపాదించుకున్నాడు. ఇతర పిల్లలను తనతో కలిసి పాడాలంటూ ప్రోత్సహిస్తున్నాడు. పిల్లల కార్యక్రమం కొనసాగుతున్నపుడు.. నవ్వుతూ తుళ్లుతూ ఉన్న తమ పిల్లలను చూసి తల్లిదండ్రులు సంతోషించటం మాకు కనిపించింది.

కనీసం తమ పిల్లలైనా ఆనందంగా ఉన్నారన్న సంతోషం తనకు కలుగుతోందని సరస్వతి నాతో చెప్పారు. ''మా ప్రాణాలు తప్ప అన్నీ కోల్పోయాం మేం. ఆనందంగా ఉన్న పిల్లల ముఖాలు చూసినపుడు.. మాకు ఒకేసారి బాధ, సంతోషం రెండూ కలుగుతాయి. కానీ.. మా పిల్లలను సంతోషంగా ఉంచటానికి దృఢంగా ఉండాలని, జీవితాలను పునర్నిర్మించుకోవాలని మాకు తెలుసు'' అని ఆమె వ్యాఖ్యానించారు.

పిల్లలతో మాట్లాడి, ఏవైనా కొత్త ఆటలు నేర్పించాలని అడిగితే వాళ్లు చాలా సంతోషిస్తారని ఫారిస్, అఫ్సల్‌లు మాతో చెప్పారు. అప్పుడు వాళ్లు మాతో మాట్లాడటం మొదలుపెట్టారు.

''మేం వాళ్లతో పాటు ఆడతాం. మాతో కలిసి ఆడకుండా దూరంగా ఉంటున్న పిల్లలను గుర్తిస్తాం. అప్పుడు వాళ్లతో మాట్లాడటానికి ప్రయత్నిస్తాం. వారు మాట్లాడటానికి సాయం చేస్తాం. కొంతసేపు మాట్లాడాక వారిలో కొందరు సంతోషంగా కనిపిస్తారు. మళ్లీ త్వరగా రావాలని మమ్మల్ని అడుగుతారు'' అని అఫ్సల్ వివరించారు.

ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరోసైన్స్ సంస్థకు చెందిన బృందాలు కూడా ఈ సహాయ శిబిరాలను సందర్శిస్తున్నాయి. శిబిరాల్లోని జనాన్ని కలుస్తూ అవసరమైన వారికి కౌన్సెలింగ్, చికిత్స అందిస్తున్నారు.

''వరదల వంటి ఈ ప్రకృతి విపత్తులు ఎప్పటికప్పుడు సంభవిస్తూనే ఉంటాయన్న వాస్తవాన్ని జనం జీర్ణం చేసుకున్నారు. కానీ.. కొండ చరియలు విరిగిపడటాన్ని చూసిన వారికి మాత్రం అది భయం గొలిపే అనుభవం. వారిలో కొందరిని తదుపరి చికిత్స కోసం ఆస్పత్రులకు పంపించాం'' అని ఐఎంహెచ్ఏఎన్ఎస్‌లో మానసిక సామాజిక కార్యకర్త డాక్టర్ రాగేష్ చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)